హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లించకపోవడంతోపాటు విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలను క్రమంగా నిర్వహించకపోవడం లాంటి అంశాలపై వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ జారీచేసిన నోటీసులకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ సమాధానమిచ్చింది. ఈ అంశాలకు సంబంధించి హైదరాబాద్కు చెందిన బోయిన ఎల్లేశ్ చేసిన ఫిర్యాదుపై బుధవారం ఢిల్లీలో వి చారణ జరగాల్సి ఉండటంతో.. రెగ్యులర్ సెక్రటరీ అందుబాటులో లేనందున విచారణకు రాలేమని జాతీయ కమిషన్కు ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్వయంగా లేఖ రాశారు.
ఉద్యోగుల బదిలీలతోపాటు గురుకుల విద్యార్థులకు అందించే వస్తువులకు టెండర్ల ఖరారు పనిలో నిమగ్నమై ఉన్నామని తెలిపారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లించే ప్రక్రియ పురోగతిలో ఉన్నదని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మానిటరింగ్ కమిటీల సమావేశాల నిర్వహణ సాధ్యపడలేదని పేర్కొంటూ.. త్వరలోనే సమావేశాలను నిర్వహిస్తామని వివరించారు. ఈ సమాధానంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నదంతా అబద్ధమని, పరిహార చెక్కులు ఇచ్చి 3 నెలలు గడిచినా నిధులను విడుదల చేయలేదని బాధితులు ఎస్టీ కమిషన్కు తెలియజేశారు. దీంతో తదుపరి సమావేశాన్ని తెలంగాణలోనే నిర్వహించి, విచారణ జరపాలని జాతీయ ఎస్టీ కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.