మునుగోడు, ఆగస్టు 28 : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌రావు ప్రకటించారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో శనివారం రాత్రి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కుమ్మరి సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జయంత్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని కొనియాడారు.
కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించడంతో ఉపాధికి గ్యారంటీ లభించిందని గుర్తుచేశారు. ఇందులో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉన్నదన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కుమ్మరి సంఘం ప్రతినిధి వై వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ దయానంద్, జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 28 : మునుగోడు గడ్డపై బీజేపీది మూడో స్థానమేనని.. ఉప ఎన్నికలో ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ రిక్కల భాస్కర్‌రెడ్డి గార్డెన్లో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ధరలు పెంచి సా మాన్యుల నడ్డి విరగ్గొడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇక్కడి ఎమ్మెల్యే రాజీనామాతో తమ కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం కనిపిస్తున్నదన్నారు. టీఆర్ఎస్ను గెలిపించేందుకు వారు ఎదురుచూస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 60 ఏండ్లుగా ఫ్లోరోసిస్‌ను పెంచి పోషించిన బీజేపీ, కాంగ్రెస్ పాపాన్ని సీఎం కేసీఆర్ ఆరేండ్లలో రూపుమాపిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకపోవడం కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.