జయశంకర్ భూపాలపల్లి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిరసన సెగ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) బేషరతుగా క్షమాపణ చెప్పాలని కలం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేశారు. జిల్లాలోని రేగొండ, చెల్పూర్లో జరిగిన కార్యక్రమంలోనూ మంత్రులకు ఇదే చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం రేగొండ, గణపురం, భూపాలపల్లి మండలాల్లో పర్యటించగా, ఎమ్మెల్యే గండ్ర వైఖరిని నిరసిస్తూ పాత్రికేయులు మంత్రుల కార్యక్రమాలను బహిష్కరించారు.
ఆదివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు పలు విషయాలపై ఎమ్మెల్యే గండ్రను ప్రశ్నించారు. ఇది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాత్రికేయులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మంత్రులు జిల్లాలో పర్యటించగా, వారి కవరేజీని బహిష్కరించారు. ఎమ్మెల్యే గండ్ర క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. గోరికొత్తపల్లి, చెల్పూర్, భూ పాలపల్లి మండలాల్లో మంత్రుల కార్యక్రమాలకు విలేకరులు హాజరుకాలేదు. నామినేటెడ్ పదవుల కేటాయింపుపై స్థానికంగా సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి రగులుతున్నది.
జిల్లాకేంద్రంలో పార్టీని నమ్ముకొని మొదటినుంచీ ఉన్న ఓ గిరిజన నేతకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలోనూ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి బరిలో ఉండగా మరొకరిని పోటీలో నిలుపడంతో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో పాత కాపులకు ప్రాధాన్యం లేకుండా పోతున్నదని, పార్టీ అధిష్ఠానం భూపాలపల్లి కాంగ్రెస్‌పై పట్టనట్టు వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు.