ఏటూరునాగారం : పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో సక్సెస్ అవుతారని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిష్టినా జడ్ చొంగ్తూ అన్నారు. స్థానిక ఐటీడీఏ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలను మంగళవారం ఏటూరునాగారం కొమురంభీం స్టేడియంలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు కెరీర్లో పునాదుల్లా ఉపయోగపడుతాయని శారీరక, మానసికంగా ధృఢంగా ఉండి క్రమ శిక్షణను పాటిస్తే విజయం సాధించడంతో పాటు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలిపారు.
ఆత్మస్థెర్యంతో క్రీడల్లో పాల్గొని గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమేనని, నిజాయితీగా ఆడడం అలవర్చుకోవాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే క్రీడల్లో ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి 1464 మంది క్రీడాకారులు, 168 మంది ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, అధికారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొంటుండగా ఒక్కో జోన్ నుంచి ఒక్కో క్రీడలో 14,17 సంవత్సరాల బాల, బాలికలు రెండేసీ టీంలుగా పాల్గొంటున్నాయి.
వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, అర్చరీ, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ పోటీలు జరుగనున్నాయి. ఏటూరునాగారం, ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పీవో అంకిత్, వరుణ్రెడ్డి, గౌతం పొట్రు, ఏఎస్పీ అశోక్ కుమార్,డీడీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.