హైదరాబాద్, సెప్టెంబర్15(నమస్తే తెలంగాణ) : సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్(ఎస్ఎంఐ)పథకం అమలుకోసం ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈఎన్సీ జనరల్ చైర్మన్‌గా, కాడా(కంట్రోల్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ) సీఈ కన్వీనర్‌గా, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సంబంధిత ప్రాజెక్ట్ టెరిటోరియల్ సీఈ, సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)రీజినల్ డైరెక్టర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌ను మెంబర్లుగా నియమించింది. ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా ఎస్ఎంఐ స్కీమ్‌ను అమలుచేస్తున్నారు. ప్రధానంగా 20 హెక్టార్ల నుంచి 2వేల హెక్టార్లలోపు ఉన్న చెరువులు, ప్రాజెక్టుల అభివృద్ధికి, నీటి వినియోగానికి చేపట్టాల్సిన పనులకు కేంద్రం 60శాతం నిధులు ఇస్తుండగా, 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. స్కీం కింద ఎంపిక చేయాల్సిన చెరువులు, ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం స్టేట్ లెవల్ శాంక్షన్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)ని ఏర్పాటుచేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.