అనాథ పిల్లల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘నేను ఒక మీటింగ్కు వెళ్తే ఇద్దరు ఆడపిల్లలు వచ్చి మేము అనాథలం.. కస్బూర్బా గాంధీ స్కూల్లో చదువుకొంటున్నాం.. పదో తరగతి అయిపోతున్నది.. ఆ తర్వాత ఎటుపోతమో మాకే తెల్వదు.. అని చెప్పారు. వారు చెప్పింది విని రాత్రంతా నేను అన్నం తినలేదు. బాగా డిస్టర్బ్ అయిపోయాను. ఏడుపొచ్చింది. మరుసటి రోజే మీటింగ్ పెట్టి కొన్ని చర్యలు తీసుకొన్నాం. ఈ మధ్యనే క్యాబినెట్లో చర్చించాం. సబ్-కమిటీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది. కస్తూర్బాగాంధీ స్కూళ్లలో కూడా ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టాలని, వారికి బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించాం. వారిని రాష్ట్ర బిడ్డలుగా ప్రకటించాలని నిశ్చయించాం. వారికి తల్లీ తండ్రీ రాజ్యమే అని కూడా చెప్పాం’ అని తెలిపారు.