హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు మన దేశానికి చెందిన పలువురు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) ఆధ్వర్యంలో స్థానిక నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో ఈ నెల 21 నుంచి 25 వరకు జరగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో మంత్రి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నీటి వనరుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారిందో వివరించనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ ప్రాజెక్టు తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలపై ఆయన ప్రసంగించనున్నారు. దీనితోపాటు పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్రంలోని వ్యాపార, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించి రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తారు. మంత్రి అమెరికా పర్యటన వారంరోజుల పాటు కొనసాగనున్నది.
మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితోనే మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందరికీ సురక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో నూరుశాతం ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రం ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశాకే కేంద్రం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో
జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణ, హర్యానా, గోవా రాష్ర్టాలు నూరుశాతం ఇండ్లకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించిన వివరాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆయా రాష్ర్టాలకు అభినందనలు తెలిపారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, జల్ జీవన్ మిషన్‌కు ముందే తెలంగాణ నూరుశాతం ఇండ్లకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మిషన్ భగీరథ పధకానికి రూ.19,000 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు.