హైదరాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిర్యాలగూడ నుంచి నల్లగొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల సొమ్మును విడుదల చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని, ఆ సొమ్మును విడుదల చేయాలని కోరుతూ సికింద్రాబాద్‌కు చెందిన నీనా కమలేశ్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలతో ఆ నగదును స్వాధీనం చేశామని, ఈ కేసులో పిటిషనర్ నిందితుడు కాదని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో కమలేశ్ షా వినతిపై స్పందించలేమని జస్టిస్ భాస్కర్‌రెడ్డి స్పష్టం చేస్తూ.. ఆయన పిటిషన్‌ను కొట్టివేశారు.