హైదరాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. కాంగ్రెస్ నాయకుడు పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు చెప్పింది. విఠల్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. తీర్పుపై అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును 4వారాల పాటు నిలిపివేయాలన్న విఠల్ తరఫు న్యాయవాది విజ్ఞప్తికి అనుమతించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ 2022లో ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ చేయించారని రాజేశ్వర్‌రెడ్డి హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. విఠల్ ఎన్నిక అక్రమమని, తానే ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ప్రకటించాలని కోరా రు. పిటిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారో లేదో తేల్చేందుకు హైకోర్టు ఆ పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో రాజేశ్వర్‌రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలింది. ఈవ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు.తిరిగి ఎన్నిక నిర్వహించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిటిషనర్ రాజేశ్వర్ రెడ్డి పోటీలో లేరు కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా ప్రకటించేందుకు ఆసారం లేదు. రాజేశ్వర్ రెడ్డి సంతకాన్ని దస్తూరాబాద్ ఎంపీపీ కిషన్ సింగారి ఫోర్జరీ చేసి ఇస్తే దానిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ధారణ చేసుకోకుండా నామినేషన్‌ను (రాజేశ్వర్ రెడ్డిది) తిరసరించారు. విఠల్ -కిషన్ కమ్మకు అయ్యారు’ అని హైకోర్టు తీర్పులో పేరొన్నది. ఇదిలా ఉంటే శాసనమండలి సభ్యుడిగా తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని దండె విఠల్ తెలిపారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తాను ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదని, ఎన్నికల్లో నిలబడి గెలిచానని, అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ రిటర్నింగ్ అధికారికి సంబంధించినదని ఆయన వివరించారు. ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పుపై సుప్రీంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.