హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): చదువులో గృహిణులను, ఖైదీలను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన 26వ స్నాతకోత్సవంలో చాన్స్‌లర్ కూడా అయిన ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిభ గల విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు చదవుతోపాటు సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ లిటరసీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డిజిటల్ విద్య, నైపుణ్య సాధికారత, విద్యార్థులకు ఉపాధి కల్పనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశేష కృషి చేస్తున్నదని కొనియాడారు.
యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గొరటి వెంకన్నకు, విద్యావేత్త, రచయిత ప్రేమ్ రావత్‌కు యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రదానం చేశారు. యూనివర్సిటీలో ఈ ఏడాది 60,288 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్లు పొందడానికి అర్హులయ్యారు. డిగ్రీలో 35,346 మంది, పీజీలో 24,942 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 32,373 మంది మహిళలు ఉండటం విశేషం. మొత్తం 55 మంది పీహెచ్‌డీలు, ఇద్దరు ఎంఫిల్ పట్టాలు అందుకున్నారు. డిగ్రీలో 35మందికి, పీజీలో 51 మందికి బంగారు పతకాలు లభించగా, వా రిలో మహిళలు 67 మంది, పురుషులు కేవలం 19 మంది మాత్రమే బంగారు పతకాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇగ్నో వీసీ ప్రొఫెసర్ ఉమా కంజిలీ పాల్గొన్నారు. వీరితోపాటు ఇద్దరు ఖైదీలు బంగారు పతకాలను అందుకోవడం విశేషం.
‘పల్లె పాట’కు పట్టం
ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ సాహిత్యరంగంలో తనదైన ముద్ర వేసిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అరుదైన గౌరవంతో సత్కరించింది. తెలంగాణ ప్రజా సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపునకు యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. గోరటి వెంకన్న 1964 ఏప్రిల్ 4న నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారంలో జన్మించారు. వెంకన్న కవిత్వంలో మట్టి పరిమళాలు వెదజల్లుతాయి. గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో.. పాట ఆనాడు కునారిల్లిన గ్రామీణ వృత్తుల దయనీయ పరిస్థితులను వర్ణించారు. కేంద్ర సాహిత్య అకాడమీతోపాటు గోరటి వెంకన్న పలు పురస్కారాలను అందుకున్నారు.