హనుమకొండ, జూలై 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యార్థులు ఆత్మబలంతో ముందుకు సాగుతూ.. సంస్కర్తలు, ఆవిషర్తలుగా మారాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సూచించారు. వరంగల్ నగరంలో సోమవారం నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవంలో చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ ప్రసంగించారు. విద్యార్థులు సాధించే విజయం విశ్వవిద్యాలయకీర్తిని ప్రతిబింబించాలని చెప్పారు. 50 ఏండ్లు నిండిన కాకతీయ యూనివర్సిటీ ఉత్తరతెలంగాణలో ఉన్నత విద్యలో మార్గదర్శిగా నిలిచిందని తెలిపారు. 672 ఎకరాల్లో 7 అనుబంధ పీజీ కళాశాలలు, 27 విభాగాలు, 500 పైగా డిగ్రీ అనుబంధ కళాశాలలతో విసృ్తత పరిధికలిగిన గొప్ప విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
‘2023లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 200 స్థానం, ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు 84వ స్థానం, గ్రీన్ మెట్రిక్స్‌లో మూడో స్థానం సంపాదించింది’ అని వివరించారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నైపుణ్యం ఉన్న విద్యార్థులే విజయం సాధిస్తారని, భాషా మాధ్యమం అభివృద్ధికి అవరోధం కాదని చెప్పారు.
చిన్న గ్రామం నుంచి వచ్చి తెలుగు మీడియంలో చదివి ఇంగ్లిష్తో పోరాడుతూ పేపర్‌బాయ్‌గా పని చేసిన తన అనుభవాలను వివరించారు. క్షయ, క్యాన్సర్ వంటి వ్యాధుల కోసం ఖర్చు తగ్గించే ఔషధ సాంకేతికత విజ్ఞానం, కొవిడ్‌వ్యాక్సిన్ అభివృద్ధి, పర్యావరణ అనుకూల శానిటరీ ఉత్పత్తులు, బయోగ్యాస్ ఆధారిత.. వాయురహిత వ్యర్థ నిర్వహణ టెక్నాలజీ వంటి విషయాలపై ఐఐసీటీ ముందున్నదని తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిధిలోని 387 మందికి పీహెచ్డీ పట్టాలు, 564 మంది బంగారుపతకాలు అందజేశారు.