Rayalaseema Lift | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ట్రిబ్యునల్ అవార్డులను, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐఎస్) పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించాలని, సంబంధిత నివేదికను కేంద్రానికి, ఎన్జీటీకి సమర్పించాలని కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ బుధవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎల్ఐఎస్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తిశాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి అర్ధరాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టులను చేపట్టాలన్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లనున్నది.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు ఎన్జీటీలోనూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఆ కమిటీ సైతం నివేదించడంతో.. పర్యావరణ అనుమతులు పొందేవరకూ ఆర్ఎల్ఐఎస్ పనులను చేపట్టవద్దని, కనీసం డీపీఆర్ తయారీకి కూడా ఎలాంటి తవ్వకాలను జరుపవద్దని స్పష్టం చేస్తూ ఎన్జీటీ 2021డిసెంబర్లో ఏపీకి ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలను, నిబంధనలను ఉల్లంఘించి పనులను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి కొద్దిరోజులుగా ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించింది. దీనిపై ‘దొంగరాత్రి సీమ లిఫ్ట్ పనులు’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
ఏపీని ఎండగట్టేందుకు కసరత్తు
ఏపీ తీరును అన్ని వేదికలపై ఎండగట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి ఏపీ పనులు చేపట్టిన విషయాన్ని వెంటనే కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నది. ఈ మేరకు ఇంజినీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అదేవిధంగా ఏపీ ఉల్లంఘనపై మరోసారి ఎన్జీటీని ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనితోపాటుగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.శ్మశానం కబ్జాపై విచారణ
‘నమస్తే’ కథనానికి స్పందన
రాజాపూర్, డిసెంబర్ 20 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఇప్పటూర్ గ్రామ శివారులో దళితుల శ్మశానవాటిక కబ్జాకు గురైందన్న వార్తకు అధికారులు స్పందించారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాజాపూర్ రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. దోండ్లపల్లి గ్రామ శివారులోని భూమి పట్టా పొలమని తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఈ భూమిలో దళితులకు సంబంధించి ఎలాంటి సమాధులు లేవని ఆయన పేర్కొన్నారు. కాగా అధికారుల తీరుపై దళితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కబ్జా విషయమై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలని వారు సూచించారు.