హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మొండివైఖరితో మాజీ సర్పంచుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతున్నది. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పుల బాధ తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఇప్పటికే 13 మంది మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం మహబూబాద్ జిల్లా కురవి మండలం కాకులబోర్డు తండా మాజీ సర్పంచ్ గుగులోతు కౌసల్య భర్త కిషన్‌నాయక్ (50) అప్పులబాధతో ఉరేసుకొన్నారు. తన భార్య సర్పంచ్ అయిన నాటి నుంచి గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.30 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి పంచాయతీలో పనులు చేశారు. నేటికీ ఆ బిల్లులు రాకపోవడంతోపాటు వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పు ఇచ్చిన బంధువులు ఒత్తిడి తేవడంతోపాటు ఇటీవల పెద్ద మనుషుల సమయంలో కిషన్‌నాయక్‌ను చెప్పుతో కొట్టారు. ఈ అప్పులబాధలు భరించలేక, మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాద్ నుంచి ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
రాష్ట్రంలోని 12,848 గ్రామ పంచాయతీల్లో మాజీ సర్పంచులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.700 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉన్నది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ గవర్నర్‌తోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు పలుమార్లు మాజీ సర్పంచులు వినతిపత్రాలు అందజేశారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జనవరిలోగా ఇస్తాం, మార్చిలోగా ఇస్తామంటూ ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ, బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరగడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికం కావడంతో ఇప్పటివరకు 13 మంది మాజీ సర్పంచులు ప్రాణాలను తీసుకున్నారు.
మాజీ సర్పంచ్ భర్త కిషన్‌నాయక్ ఆత్మహత్యను ప్రభుత్వహత్యగానే భావిస్తున్నామని, ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రశ్నించారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు గ్రామానికి అభివృద్ధికి చేసిన పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కిషన్‌నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు కేశబోయిన మల్లయ్య, నాయకులు బొడ్డు నర్సింలు, సముద్రాల రమేశ్, మన్నె పద్మారెడ్డి, అరవింద్‌రెడ్డి, ఓర్సు వెంకటేశ్, మంగ నర్సింలు పాల్గొన్నారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు అందక ఇప్పటికే 13 మాజీ సర్పంచులు చనిపోయారని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. పెండింగ్ బిల్లులు విడుదలచేసే వరకు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు.