Family Digital Card | రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వన్ డిజిటల్ కార్డ్` విధానంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో లబ్ధి దారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకుంటారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతి ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లో సభ్యుల కలయిక, తొలగింపు విషయమై ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచింంచారు.
అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కోసం జిల్లాలవారీగా ఒక వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కోసం రాజస్థాన్, హర్యానా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.