రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సకల చర్యలు తీసుకొంటున్నది. ఒకవైపు సాగు విస్తీర్ణం, వివిధ పంటల ఉత్పత్తిని పెంచడంతో పాటు వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించింది. ప్రతి జిల్లాల్లోనూ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటుచేస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా పంట ఉత్పత్తులను పెంచడంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లు, ఫుడ్పార్క్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని రూపొందించడంతోపాటు సింగిల్ విండో అనుమతులు ఇస్తున్నది. ఇప్పటికే ఆహార రంగంలోని పలు ప్రతిష్ఠాత్మక బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరాయి. రాష్ర్టాన్ని ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కొత్త పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులను వివిధ ప్రక్రియల ద్వారా మరింత రుచికరంగా, దీర్ఘకాలం నిల్వ చేసుకోవడానికి, తినడానికి యోగ్యంగా మార్చడమే ఫుడ్ ప్రాసెసింగ్ ప్రధాన ఉద్దేశం. నూడుల్స్, పాస్తా, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్డు, పసుపు పొడి, కారం, వివిధ మసాలాలు తదితర పదార్థాలు ఇందులో ముఖ్యమైనవి. పాలు, అరటిపండ్లు, మామిడి, జామ, బొప్పాయి, తదితర పండ్లు, కూరగాయలు, వడ్లు, చెరుకు, వేరుశనగ, పప్పుధాన్యాలు రాష్ట్రంలో విరివిగా పండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులోభాగంగా ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కనీసం 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా కలెక్టర్లు ఇప్పటికే భూములను గుర్తించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,496 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఎక్కువగా నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం నుంచి దరఖాస్తులు వచ్చాయి. అత్యధిక శాతం మంది దరఖాస్తుదారులు రైస్ మిల్లుల ఏర్పాటుకే ఆసక్తి చూపారు. దీంతోపాటు మిర్చీ, పసుపు, జొన్న, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర పిల్లల తినుబండారాల పరిశ్రమలు, మాంసం, చేపలు, చికెన్ శుద్ధి పరిశ్రమలు, వంటనూనెలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తదితర వాటి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులొచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలకు స్థానం కల్పించింది.