హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): తడిసిన పెసర్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయిన పెసర్లను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ నిబంధనలు ఒప్పుకోవని చెప్తున్నారు. తద్వారా రైతుల నుంచి పెసర్ల కొనుగోలును నిలిపివేశారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొన్నటివరకు కనీసం మద్దతు ధర కూడా లభించకపోవడంతో నష్టపోయిన రైతులు ఇప్పుడు వర్షాలతో పంట తడిసి మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెసర్లకు మద్దతు ధర దక్కకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ప్రభుత్వం ఎట్టకేలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. నాఫెడ్ సహకారంతో కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పెసర పంట తడిసిపోయింది. తడిసిన పంటను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఇందుకు నాఫెడ్ నిబంధనలు అంగీకరించవని చెప్తున్నారు. నాఫెడ్ నిబంధనల ప్రకారం తేమ శాతం 12కు మించితే కొనుగోలు చేయబోమని అంటున్నారు. దీంతో పెసరు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, కామారెడ్డి, మహబూబాబాద్ రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో 64,175 ఎకరాల్లో పెసర పంట సాగు కాగా 17,841 టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా ఖమ్మంలో 14 వేల ఎకరాలు, వికారాబాద్‌లో 12,500, సంగారెడ్డిలో 11 వేలు, మహబూబాబాద్‌లో 5 వేలు, కామారెడ్డిలో 4,600 ఎకరాల్లో పెసర పంట సాగైంది. ఇప్పటివరకు పెసర్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్పైనే ఆధారపడింది. నాఫెడ్ అనుమతిచ్చే కోటా కోసం ఎదురు చూసింది. ఆ మేరకు మాత్రమే కొనుగోలుకు నిర్ణయించింది. సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున కొనుగోలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి. వర్షాలతో తడిసిపోయిన పంటను కొనుగోలు చేసేందుకు నాఫెడ్ అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తడిసిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్క్‌ఫెడ్‌కు ఎలాంటి ఆదేశాలు రాలేదు. తడిసిన పెసర్ల కొనుగోలుకు వెంటనే ఆదేశాలు జారీచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.