హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడ, ఏ రకమైన తవ్వకాలకైన కాల్ బిఫోర్ యు డిగ్ (సీబీయూడీ) యాప్ ద్వారా టెలికాం అధికారులకు ముందస్తు సమాచారం అందించాలని, అనుమతి ఇచ్చాకే తవ్వకాలు చేపట్టాలని టెలికాం అధికారులు తెలిపారు. రాష్ట్రప్రభుత్వంలోని అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ముందుగా యాప్‌ను ఉపయోగించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి టెలికాం అధికారులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాంరంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్‌డిపార్ట్‌మెంటల్ సమస్యలపై చర్చించారు.
అనేక టెలికాం సూచికలలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందున్నదని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పేరొన్నారు. దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికమని తెలిపారు. 97.7 శాతం గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ ఉన్నదని, దేశంలో 5జీని ప్రారంభించిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రైట్ఆఫ్ వే దరఖాస్తుల పరిస్థితిని సమీక్షించారు. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు వరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, పీఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.