Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎమోషన్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యాన్ని కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరును ఓటీటీ వేదికపైనా కొనసాగిస్తోంది.ఇటీవల ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన ‘పెద్ది’ విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకుంది. సినిమా ఓటీటీలోకి వచ్చిన మరుసటి రోజే భారత్లో నెట్ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ మూవీస్ జాబితాలో నంబర్-1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు మరోసారి సినిమాను ఆస్వాదించాలని భావించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఓటీటీలో వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా ‘పెద్ది’ గురించి చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఓటీటీ వెర్షన్లో థియేటర్లలో లేని కొన్ని అదనపు సన్నివేశాలను కూడా జోడించడంతో అభిమానులు మరింత ఆసక్తిగా సినిమాను వీక్షిస్తున్నారు. ఈ కొత్త సీన్స్ కథలోని కొన్ని భావోద్వేగాలకు మరింత బలం చేకూర్చాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించగా, జాన్వీ కపూర్ నటన కూడా మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, గ్రామీణ వాతావరణాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచాయి. ప్రతి కీలక సన్నివేశంలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. భారీ నిర్మాణ విలువలతో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సాధించిన విజయాన్ని ఇప్పుడు ఓటీటీలోనూ కొనసాగిస్తూ మరోసారి తన సత్తా చాటుతోంది. థియేటర్ల తర్వాత డిజిటల్ వేదికలో కూడా ‘పెద్ది’కి వస్తున్న ఆదరణ చూస్తుంటే, రామ్ చరణ్ ఖాతాలో మరో సూపర్ హిట్గా ఈ సినిమా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.