హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీలకు తీరని ద్రోహం తలపెడుతున్నదని, నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని పెంచేదిలేదని తెగసి చెప్పడమే దానికి నిదర్శనమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన శుక్రవారం బహిరంగలేఖ రాశారు. ప్రస్తుతం అమలులో 8 లక్షలున్న సీలింగ్ సంతృప్త స్థాయిలోనే ఉన్నదని, పెంపుదల చేయబోమని లోక్‌సభలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారికత మంత్రి డాక్టర్ వీరేంద్రకుమార్ ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. డీవోపీటీ నిబంధనలను, జాతీయ బీసీ కమిషన్, ఓబీసీ పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫారసులను కేంద్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అసలు ఎన్సీబీసీ సిఫారసులే చేయలేదని అనడం పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. 1993 నుంచి లక్ష పరిమితితో ఆరంభమై నేడు 8 లక్షల వరకు చేరుకున్నదని, దానిని 2017లో స్థిరీకరించారని గుర్తుచేశారు. ఆ పరిమితిని 15 లక్షలకు పెంచాలని జాతీయ బీసీ కమిషన్ 2015లో సిఫారసు చేసిందని గుర్తుచేశారు. డీవోపీటీ నిబంధనల ప్రకారం మూడేండ్లకోసారి నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని సమీక్షించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం సమీక్షించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకొని, నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని 15 లక్షలకు పెంచాలని వకుళాభరణం డిమాండ్ చేశారు.