హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన విశేష అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ మేరకు నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ఇతర రాష్ర్టాల ప్రతినిధులకు గొప్పగా చెబుతున్నది. ఈ మేరకు శనివారం రాష్ర్టానికి వచ్చిన కేరళ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పీ ప్రసాద్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ సమగ్రాభివృద్ధిని వివరించారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపడుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను, సంసరణలను పీపీటీ ద్వారా వివరించారు. తెలంగణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానం నిలిచిందని మంత్రి చెప్పారు. వ్యవసాయానికి, రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంతోపాటు జీవిత బీమా (రైతుబీమా) పథకాన్ని అమలు చే స్తునట్టు మంత్రి తెలిపారు. పారదర్శకత కోసం సహకార సంఘాల కంప్యూటరీకరణలో తొలిస్థానంలో నిలిచినట్టు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్నదని, ప్రస్తుతం ఇది 2.40 కోట్ల ఎకరాలకు అంటే 83 శాతం పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేరళ బృందానికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15లో 94.90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2022-23లో 346.4 లక్షల మెట్రిక్ టన్నులకు అంటే 265.010 శాతం పెరిగిందని తెలిపారు. వరి విస్తీర్ణం 35 లక్షల ఎకరాల నుంచి 121.43 లక్షల ఎకరాలకు, ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 258 లక్షల మెట్రిక్ టన్నులు వరకు పెరిగిందని చెప్పారు. అయితే వ్యవసాయ రంగంలో జరిగిన ఈ అభివృద్ధి అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరగడం గమనార్హం. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం సుభిక్షమని పరోక్షంగా ఒప్పుకున్నట్టేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.