హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బయోటెక్నాలజీ రంగం పరిశోధనాంశాల్లో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోనున్నట్టు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదో రోజైన శనివారం అక్కడి మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్, డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో మంత్రి భేటీ అయ్యారు. వాషింగ్టన్ డీసీలోని ఐఎఫ్పీఆర్ఐ ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం మేరీల్యాండ్ యూనివర్సిటీ సహకారం కావాలని కోరారు. రోబోటిక్స్, కృత్రిమ మేధకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. వైద్యం, వ్యవసాయం వంటి కీలక అంశాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో యూనివర్సిటీతో కలిసి పనిచేస్తే తెలంగాణ వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, ఐఎఫ్పీఆర్ఐ మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. నేల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ, మెరుగుదలకు సంబంధించిన విషయాల్లో సహాయ, సహకారాలు అందిపుచ్చుకోనున్నట్టు తెలిపారు. పశువుల ఆరోగ్య సమస్యలు, పోషణ అంశాల్లో యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎన్ఐఎఫ్ఏ) మద్దతు ఇవ్వనున్నదని వివరించారు. తెలంగాణలో మరింత వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాల్సి ఉన్నదని తెలిపారు. సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, మేరీల్యాండ్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఆఫ్ రీసెర్చ్ పునీత్ శ్రీవాస్తవ, డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జిమ్మీ స్మిత్, యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.