నమస్తే తెలంగాణ నెట్వర్క్,మే 13 : ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని గ్రామాల్లో గాలివాన బీభత్సానికి వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. ములుగులో ధాన్యం రాసులపై కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. ధాన్యం రాశులు, బస్తాలు తడిసిపోయాయి. ములుగులోని ఎస్పీ కాలనీలో కారుపై విద్యుత్ స్తంభం విరిగిపడడంతో దెబ్బతింది. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. వాజేడు మండలంలో మామిడి కాయలు నేలరాలిపోయాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వాపోయారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెగడపల్లి, ముచ్చర్లలో వానకు వడ్లు కొట్టుకుపోయాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని పాగుంట గ్రామానికి చెందిన కురువ సిద్ధప్ప నాలుగెకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. దాదాపుగా 45 క్వింటాళ్ల మిరప పంటను పొలం వద్ద నిల్వ చేశాడు. కాగా, అర్ధరాత్రి నిల్వ చేసిన మిరప ఉత్పత్తులపై పిడుగుపడడంతో మొత్తం కాలి బుడిదైంది. దాదాపుగా రూ.9 లక్షల నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు.