హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు భవనం నిర్మించాలన్న నిర్ణయంపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రకృతి విపత్తుల శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరు తప్పనిసరని పేర్కొంది. ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్ వ్యవసాయ యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనలకు ఉపయోగపడే భూములను లాక్కొన్న ప్రభుత్వం.. అక్కడ హైకోర్టు నూతన భవనం నిర్మిస్తున్నదని యూనివర్సిటీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఎస్టీ కమిషన్ సంబంధిత అధికారులకు ఈనెల నాలుగున నోటీసులు జారీచేసింది. వివాదానికి సంబంధించిన భూముల వాస్తవ రికార్డులు, డాక్యుమెంట్స్‌ను సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు నూతన భవనం కోసం యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకున్నది. అయితే ఈ భూముల్లో బయోడైవర్సిటీ నెలకొందని, పరిశోధనలకు అనువైన భూములను తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.
ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహించారు. దీనిపై గతంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్లింది. దీంతో విద్యార్థులు ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు న్యాయం కోసం రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.