పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామ సమీపంలోని పెగడపల్లి- కరీంనగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎస్సారెస్పీ కాలువ వెంతెన (SRSP Canal Bridge) ప్రమాదకరంగా మారింది. దీంతో వహనదారులు ఈ వంతెనపై ప్రయాణం అంటేనే తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కాలువపై సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరుతోంది. వంతెనపై మిషన్ భగీరధ నీటితో పాటు వర్షపు నీళ్లు, ఇసుక నిలుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే వంతెనకు చెందిన ఒక వైపు సిమెంట్ రెయిలింగ్ సగం మేర కూలిపోవడంతో పాటు వంతెనపై రాళ్లు, కంకర తేలడం పైన ఉన్న ఇసుక, నీళ్ల వల్ల వాహనాలు ప్రమాదవశాత్తు జారిపోయి కాలువలో పడే ప్రమాదం ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెగడపల్లి మండల కేంద్రం నుండి గంగాధరతో పాటు కరీంనగర్ కు వెళ్లేందుకు వాహనదారులకు ఇది ప్రధాన రహదారి కావడంతో, ఈ డబుల్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. సంబంధిత అధికారులు స్పందించి, ఎస్సారెస్పీ కాలువకు వంతెనకు మరమ్మత్తు పనులు చేపట్టి, ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.