హైదరాబాద్ : టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన గురువారం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.
ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారని వేదపండితులు తెలిపారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయని అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారని వెల్లడించారు.
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సరస్వతి ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తిభావాన్ని పెంచాయి. గోవా గవర్నర్ పిఎస్.శ్రీధరన్ పిళ్లై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.