హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం డ్యామ్ భద్రతపై నిపుణుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ డ్యామ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మరోసారి ఏపీకి స్పష్టం చేసింది. శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చే భారీ ప్రవాహం వల్ల స్పిల్‌వే దిగువన 40 మీటర్ల లోతులో భారీ గొయ్యి (ప్లంజ్ పూల్) ఏర్పడిందని, దీంతో ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉన్నదని గతంలోనే ఏబీ పాండ్య కమిటీ వెల్లడించింది. డ్యామ్ భద్రతకు వెంటనే చర్యలు చేపట్టాలని, స్కైజంప్ బకెట్‌కు మరమ్మతులు చేయాలని సూచించింది. అనంతరం ఎన్డీఎస్ఏ బృందం అదే విషయాన్ని నొక్కిచెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ నిర్వహిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. స్పిల్‌వే దిగువన ప్లంజ్ పూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నదని, ఫలితంగా పునాది నిర్దేశిత స్థాయి కంటే బలహీనపడి స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది.