Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. అక్కడ అభివృద్ధి లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతిని కలవకుండా బీసీ బిల్లు ఎలా పాసవుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలకు దీనిపై బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లు పాస్ చేయించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.