ఖైరతాబాద్, జూలై 18: కల్తీని అరికట్టడం చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి జీవనాధారమైన కల్లుపై నిషేధం విధించాలని యోచిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. మద్యం మాఫియాకు తలొగ్గి కల్లును నిషేధిస్తే లక్షలాది మంది కల్లుగీత వృత్తిదారులతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ పేరిట కల్లు వృత్తినే నిషేధించాలని చూస్తున్నారని, ఔటర్ రింగు రోడ్డు లోపలి దుకాణాలన్నింటినీ మూసివేస్తామంటూ సర్కార్ లీకులు ఇప్పిస్తున్నదని ధ్వజమెత్తారు. గతంలోనూ వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో కల్లుపై నిషేధం విధించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గీత వృత్తిదారులను ఆదుకున్నదని తెలిపారు.
ఇటీవల కల్తీ జరిగిన కల్లు దుకాణం కాంగ్రెస్ కార్పొరేటర్దేనని, ముందుగా అతనిపై చర్యలు తీసుకోవాలని, కల్తీని నిరోధించడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మామూళ్ల మత్తులో కొందరు కల్తీని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఒక కల్లు కంపౌండ్‌లో 200 మందికి జీవనధారం దొరుకుతుందని, అదొక కుటీర పరిశ్రమగా కొనసాగుతున్నదని చెప్పారు. కల్లు నుంచి వైన్, వోడ్కా లాంటివి తయారు చేయవచ్చని శాస్తవ్రేత్తలు చెప్తున్నారని, అలాంటి తరుణంలో ఈ ప్రకృతి పానీయమే లేకుండా చేయాలని పాలకులు చూస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీని వెనుక ఉన్నది మద్యం మాఫియా ఉన్నదని విమర్శించారు.
లోపాయికారి ఒప్పందం
డిస్టిలరీ కంపెనీ నుంచి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కల్లును పూర్తిగా బంద్ చేయిస్తే మద్యం సరఫరా పెరుగుతుందని, తద్వారా మరింత కమీషన్లు ఇస్తామని ఆయా కంపెనీలు సైతం ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కర్నాటకలోనూ అదే జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 11 లక్షల లీటర్లు ఇచ్చే ఆవులు, బర్రెలే ఉన్నాయని, కానీ నిత్యం 56 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయని, కెమికల్స్, యూరియా వంటి రసాయనాలు కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారని ఆరోపించారు. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం, కేవలం 2 శాతం మంది సేవించే కల్లులో కల్తీ జరిగితే పూర్తిగా ఆ వ్యవస్థపై నిషేధం పెట్టాలని చూడటం ప్రభుత్వ అవివేకతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గెలుపునకు జాతి ఓట్లు కూడా దోహదపడ్డాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్‌లో కల్లును నిషేధిస్తే తమ పదవులను వదిలి బయటకు రావాలని స్పష్టంచేశారు. సమావేశంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, తెలంగాణ గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎలికట్టె విజయ్‌కుమార్, బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లీగల్ అడ్వయిజర్ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు పంజాల జైహింద్‌గౌడ్, బీసీ, గౌడ నేతలు మేకపోతుల నరేందర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, శ్రవణ్‌గౌడ్ పాల్గొన్నారు.