హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెన్నా ప్రతాప్‌రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్‌కు లీజుల మంజూరులో నాటి పరిశ్రమలశాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. మంత్రిమండలి ఆమోదం లేకుండానే ఫైళ్లను సర్క్యులేట్ చేశారని, పెన్నా సిమెంట్స్‌కు లీజులు మంజూరు చేస్తూ జీవోలు ఇచ్చారని వివరించింది.
రంగారెడ్డి జిల్లా తాండూరులో 822.13 ఎకరాల్లో లీజు రెన్యువల్‌తోపాటు హైదరాబాద్‌లో పయనీర్ హోటళ్ల నిర్మాణాలకు రాయితీల కల్పనలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పింది. ఏపీలోని యాడికిలో 231 ఎకరాలు, ప్యాపిలి మండలం కౌలపల్లిలో 304 హెక్టార్లు లీజుకు ఇచ్చారని వివరించింది. ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ కంపెనీల్లో ప్రతాప్‌రెడ్డి రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టారని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 4వ తేదీకి వాయిదా పడింది.