యాదాద్రి, జూలై 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 29 నుంచి శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో 30 మంది రుత్వికులు పాల్గొని రోజుకు అమ్మవారి నామాన్ని 3.60 లక్షల సార్లు జపిస్తారని వారు పేర్కొన్నారు. 30 రోజుల వరకు కోటి 8 లక్షల లక్ష్మీ నామస్మరణ పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. శనివారం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 7 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఇందులో పాల్గొనే భక్తులకు వారి గోత్ర నామాలతో సంకల్పం చేసి 30 రోజులపాటు పూజలు నిర్వహించి శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తామన్నారు. దంపతులకు రూ.2 వేల ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం మొట్టమొదటిసారిగా జరిగే కోటి కుంకుమార్చన ఉత్సవాలను అత్యంత వైభవంగా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. మహిళా సౌభాగ్యం, లోకకల్యాణం, విశ్వశాంత్యార్థం, క్షేత్ర అభివృద్ధి, మహామంత్ర శక్తి సమర్పణం, యంత్రశక్తి ఉద్దీపనలు అనుసరించి ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు చెప్పారు. భక్తులంతా కుంకుమార్చనలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.