Deer | ఆదిలాబాద్ : ఓ మచ్చల జింకపై కుక్కలు దాడి చేసేందుకు యత్నించాయి. కుక్కల దాడి నుంచి ఆ జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు ఆ యువకుడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మాణిక్గూడ గ్రామంలో చోటు చేసుకుంది.
మాణిక్గూడ గ్రామ పరిసరాల్లో ఓ మచ్చల జింకను కుక్కలు చుట్టుముట్టాయి. ఆ జింకపై దాడి చేసేందుకు కుక్కలు యత్నించాయి. దీంతో కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు జింక.. స్థానికంగా ఉన్న వ్యాపారవేత్త ఫయాజ్ వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న ఫయాజ్ కుమారుడు రహ్మన్.. కుక్కల నుంచి జింకను రక్షించాడు. కుక్కలను అక్కడ్నుంచి తరిమేశాడు. అనంతరం ఆ జింకను రహ్మన్ అటవీశాఖ అధికారులకు అప్పగించాడు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అప్పలకొండ మాట్లాడుతూ.. జింకను రహ్మన్ ప్రాణాలతో కాపాడాడని తెలిపారు. కుక్కల దాడిలో జింక స్వల్పంగా గాయపడిందన్నారు. ప్రథమ చికిత్స అనంతరం జింకను అడవిలోకి వదిలిపెడుతామని చెప్పారు. కుక్కల దాడి నుంచి జింకను రక్షించిన రహ్మన్పై అటవీశాఖ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.