మహబూబ్‌నగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మారుతున్న కాలానికనుగుణంగా పరిశోధనలు చేయాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఇందుకోసం నూతన ఆవిష్కరణలు రావాలని అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో రెండ్రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్-2022 సదస్సును మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది జీవితంలో భాగమైందని చెప్పారు. తపన ఉంటే విద్యార్థులు, యువత అద్భుతాలు సృష్టించగలరని అన్నారు. పలు దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడంపై వీసీ రాథోడ్‌ను మంత్రి అభినందించారు. ఈ సదస్సులో మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లింబ్బూన్ హుయ్ తదితరులు పాల్గొన్నారు.