Spiritual Day | స్వపరిపాలనలో తెలంగాణ సొంత అస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట వత్ర మండపంలో దేవాదాయశాఖ నిర్వహించిన వేడుకల్లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,043 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అర్చకులకు ధూపదీప నైవేద్య నియామక పత్రాలను మంత్రులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలు, పండుగల, వేడుకలకు ప్రాధాన్యం కల్పించడంతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలకు, వేడుకలకు ప్రపంచ ఖ్యాతి లభించిందన్నారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఆధ్యాత్మికంగా నిరాధారణకు గురైందని, సమైక్య రాష్ట్రంలో కేవలం 1,805 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తే.. కేసీఆర్ 6,641 ఆలయాలకు ఈ పథకాన్ని విస్తరించారన్నారు. దీంతో అర్చకుల జీవన విధానంలో ఎంతో వృద్ధి కనబడుతుందన్నారు. ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకుల వేతనాలను రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని కేసీఆర్ నిర్ణయించారన్నారు. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో పునర్నిర్మించడం జరిగిందన్నారు.
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు వీటీడీఏ 35 ఎకరాల భూమిని సేకరించిందని, ఇప్పటి వరకు వేములవాడ ఆలయ అభివృద్ధి విస్తరణకు రూ.70కోట్లు ఖర్చు చేశామన్నారు. వేములవాడ అభివృద్ధికి రూ.50కోట్లు, యాదాద్రి అభివృద్ధికి రూ.200కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కామన్ గుడ్‌ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అనేక ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలను చెల్లిస్తున్నామన్నారు. భక్తుల వసతుల కల్పన కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఆధ్యాత్మికంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతకు ముందు రాయగిరిలో రూ.12కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేద పాఠశాలకు మంత్రులు భూమిపూజ చేశారు. అన్నదాన సత్రాన్ని, ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రులు ప్రారంభించారు.