హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తేతెలంగాణ): టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అటవీశాఖ దృష్టి సారించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల వేగం మించకూడదని వాహనదారులను ఆదేశించింది. అటవీ ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాల మితిమీరిన వేగం కారణంగా వన్యప్రాణులు మృత్యువాతపడుతున్నాయి. నాగరకర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్‌లో నెలకు 40 నుంచి 50 వరకు ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వాహనాల వేగ నియంత్రణకు స్పీడ్ లేజర్ గన్లను ఉపయోగించేందుకు అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. శ్రీశైలం రహదారిపై రద్దీగా ఉండే మన్ననూర్- దోమలపెంట మార్గంలో వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నారు. రెండు నెలలపాటు దీనిపై వాహనదారులకు అవగాహన కల్పించనున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనదారులపై జరిమానాలు విధించే అంశంపైన ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచిచూస్తున్నామని అధికారులు వెల్లడించారు.