హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో చదువుకొంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహత్మాగాంధీ, శాతవాహన వర్సిటీల్లో ప్రత్యేక కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నందున త్వరలో ఈ శిక్షణ ప్రారంభించనున్నారు. ఆయా వర్సిటీల వీసీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. ఉద్యోగార్థులకు వర్సిటీల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని, అందుకు అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని తెలిపారు. దీంతో విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి సాధ్యమైనంత త్వరలో శిక్షణ ప్రారంభించాలని ఆయా వర్సిటీలు నిర్ణయించాయి.
వర్సిటీల్లో ఏర్పాట్లు
విద్యార్థుల కోసం సివిల్ సర్వీసెస్ అకాడమీని స్థాపించేందుకు ఓయూ ముందుకొచ్చింది. ఇందుకు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లను నియమించింది. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో కనీసం 200 మంది విద్యార్థులకు గ్రూప్-1, 2, 3, 4, పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాట్లు చేస్తున్నారు.