హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లిలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ ముడిపదార్థాలు దొరకడంపై ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతుంటే ఎక్సైజ్‌శాఖ ఏం చేస్తున్నదని నిలదీశారు. చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్ మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డ నేపథ్యంలో కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేసేందుకు అవసరమైన ముడిపదార్థాలను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇంత జరుగుతున్నా మన ఎక్సైజ్‌శాఖ ఏం చేస్తున్నదని అసంతృప్తిని వ్యక్తంచేశారు. భవిష్యత్తులో పునరావృతం కావొద్దని అన్నా రు. ఈ సమీక్షలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్, అదనపు కమిషనర్ ఖురేషీ పాల్గొన్నారు.
తెలంగాణ భాషాభివృద్ధికి కాళోజీ కృషి ప్రశంసనీయం : జూపల్లి
తెలంగాణ భాషాభివృద్ధికి కాళోజీ చేసిన కృషి ప్రశంసనీయమని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన కాళోజీ నారాయణరావు రచించిన కథల పుస్తకాన్ని సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకోవడం శుభసూచకమని పేర్కొన్నారు. ఆయన 111వ జయంత్యుత్సవాల సందర్భంగా కథల పుస్తకాన్ని ప్రచురించిన తె లంగాణ సాహిత్య అకాడమీని అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ సా హిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, కవి యాకుబ్, ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.