హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వచ్చేనెల ఆలయాలకు రాలేనివారి పేరుతో పూజలు,అర్చనలు చేయించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ తపాలాశాఖ సౌజన్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొమ్మిది ప్రధాన ఆలయాల్లో అంతరాలయ కుంకుమార్చన, అష్టోత్తర నామార్చన సేవలను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఔత్సాహికులు అక్టోబర్ 5 లోగా స్థానిక పోస్టాఫీసుల్లో లేక ఆన్లైన్ వెబ్‌పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్చనలు నిర్వహించడంతోపాటు స్పీడ్‌పోస్టు ద్వారా అక్టోబర్ 15 నుంచి 23లోగా ప్రసాదం ఇంటికే పంపిస్తారు. ప్రసాదం డిస్పాచ్ అయిన తరువాత ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
సేవలు పొందే ఆలయాలు: బాసర శ్రీజ్ఞానసరస్వతి ఆలయం, అలంపూర్ శ్రీజోగులాంబ ఆలయం, వరంగల్ శ్రీభద్రకాళి ఆలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం, బల్కంపేట్ శ్రీఎల్లమ్మ పోచమ్మ ఆలయం, ఏడుపాయల శ్రీ వనదుర్గాభవానీ ఆలయం, వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయం, బేగంపేట్ శ్రీకట్టమైసమ్మ, సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని ఆలయం.