Gramapanchayathi | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానున్నది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. శుక్రవారమే బాధ్యతలు స్వీకరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. ఆయా మండలాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, డీటీ, ఆర్ఐ, ఇంజినీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నతాధికారులు నియమించారు. గురువారం సాయంత్రమే సర్పంచుల ఆధీనంలో ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతర రికార్డులన్నంటినీ స్వాధీనం చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
రికార్డుల స్వాధీనంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీప్పవని హెచ్చరించారు. ప్రత్యేక అధికారికి, కార్యదర్శికి ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్ అవకాశం కల్పించింది. డిజిటల్ కీకి స్పెషల్ ఆఫీసర్ అధీకృత అధికారిగా వ్యవహరిస్తారు. డిజిటల్ కీ, చెక్కులు, రికార్డుల్లో ఏదైనా సమస్య తలెత్తితే కార్యదర్శిదే బాధ్యత అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ పంచాయతీలలో డ్రా చేసే నిధులన్నింటినీ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2011 నుంచి 2013 వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2018లో పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి.