సిద్దిపేట, ఏప్రిల్ 22: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర క్రీడా యువజన సర్వీసులశాఖ సెట్విన్, ధ్రువ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. జాబ్ మేళాను అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్‌రావు, డీవైఎస్వో నాగేందర్, ధ్రువ కంపెనీ ప్రతినిధి మన్మోహన్‌లతో కలిసి జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి 3,616 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ జాబ్‌మేళాలో అపోలో ఫార్మా, హెచ్డీఎఫ్సీ, జియో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కాఫీడే, హెటిరో తదితర 40 కంపెనీలు పాల్గొని ఉద్యోగులను సెలక్ట్ చేసుకున్నాయి. 556 మంది ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం సెలక్ట్ కాగా, 215 మందికి నియామకపత్రాలు అందజేశారు.