శ్రీశైలం : శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లతోపాటు పరివార దేవతలకు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతికి బుధవారం ఉదయం పంచామృతాలు, ఉదకాభిషేకాలు, పుష్పార్చనతో పాటు హోమాలు జరిపారు. అలాగే వీరభద్రుడికి ప్రదోషకాలంలో షోడశోపచార క్రతువులు జరిపారు. మల్లికాగుండంలోని శుద్ధ జలాలతో స్వామివారికి ప్రత్యేకాభిషేకం జరిపారు. స్వామి అమ్మవార్లకు నృత్య నివేదన ఆలయ మాడవీధిలో జరుగుతున్న కళారాధన కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయ నృత్యాలు, భక్తిగీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. పురాతన ఆచారాలు సాంప్రదాయాలతో స్వామిఅమ్మవార్లను కొలిచే విధానాన్ని భక్తిని చాటే జానపదగీతాలతో గాత్ర నివేదన చేసినట్లు ఈవో లవన్న, పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రదొషకాల సమయంలో ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.

శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు దేవస్థానంతోపాటు స్వచ్ఛందంగా సేవలను అందిస్తున్న నిత్యాన్నదాన సత్రాలు కల్పిస్తున్న వసతులు అభినందనీయమని ఈవో లవన్న అన్నారు. బుధవారం క్షేత్ర పరిధిలోని హిందూ మాల నిత్యాన్నదాన సత్రంలో నూతనంగా నిర్మించే భోజనశాలకు భూమిపూజ చేశారు. సత్రం అధ్యక్షుడు పాలేటి కోటేశ్వరరావు, పెరుమాళ్ల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఈవో హాజరయ్యారు. సత్రంలో జరిగే నిత్య కార్యక్రమాలను పరిశీలించారు. 1988 నుంచి అంచెలంచెలుగు అభివృద్ధి చేస్తూ వచ్చిన వివరాలను తెలుసుకుని యాత్రికుల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పించడంలో దేవస్థానం సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మల్లయ్య, లక్ష్మీనారాయణ, శివశంకర్, వెంకటయ్య, మారెన్న, మేనేజర్ శివ పాల్గొన్నారు.