హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారుతాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 420 హామీలను 420 రోజులైనా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఓ న్యూస్ చానల్‌కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో క్రైం రేట్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. స్వల్పకాలంలో కేటీఆర్ ఐటీ కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించారని గుర్తుచేశారు. టీఎస్ బీపాస్, టీఎస్ ఐపాస్ వంటి పాలసీలతో రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రైవేటురంగంలో 20 లక్షల ఉద్యోగాలను నాడు కేటీఆర్ కల్పించారని గుర్తుచేశారు. భూమి కనిపిస్తే ఎలా పచ్చగా చేయాలా అని కేసీఆర్ ఆలోచిస్తారని, భూమి కనిపిస్తే ఎలా రాళ్లుపాతి అమ్మాలా? అని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. రేవంత్ పాలనలో ధాన్యం సేకరణే జరగలేదని, ఒకవేళ సేకరిస్తే ఆ ధాన్యం ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుట్రకు తెరలేపారని విమర్శించారు.