హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే విద్యార్థులకు, గృహిణులకు యూనివర్సిటీలు ఇకనుంచి ఆశ్రయం కల్పించనున్నాయి. ఇందుకు వర్సిటీల్లో ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు నిర్వహించనున్నాయి. అయితే అడ్మిషన్ మాత్రం ఇవ్వరు.. వసతిని మాత్రమే కల్పిస్తరు. ఈ హాస్టళ్లను మహిళా శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేయనుండగా, నిర్మాణానికియ్యే వ్యయాన్ని ఆ శాఖయే భరిస్తుంది.
మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఇటీవలికాలంలో గ్రామీణ మహిళలు, బాలికలు టైర్ -1 నగరాలు, మెట్రో నగరాలకు వలసపోతున్నారు. అయితే, వీరికి నగరాల్లో సురక్షిత వాతావరణం, వసతిని కల్పించేందుకు‘సఖి నివాస్’ పేరిట వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు మహిళా శిశుసంక్షేమశాఖ ముందుకొచ్చింది. వీటి నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి సూచించారు.
ఈ మేరకు యూనివర్సిటీల వీసీలు, కాలేజీలు, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆయన లేఖ రాశారు. రాబోయే 10 రోజుల్లో తమ పరిధిలోని 10 నుంచి 15 స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. హాస్టళ్లో వసతి, భోజనంతో పాటు డే కేర్ సెంటర్ నిర్వహిస్తారు. .