ఖైరతాబాద్, ఏప్రిల్ 15 : కోనోకార్పస్ వృక్షాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నట్టు పలు పరిశోధన పత్రాలు స్పష్టం చేస్తున్నాయని వక్తలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న ఏ వృక్షం, జీవజాలం చేటు చేయదని పేర్కొన్నారు. కోనోకార్పస్ వృక్షాల వేర్లు విస్తరించి పైపులైన్లు, గోడలను దెబ్బతీస్తాయని, విషవాయులను విడుదల చేస్తాయన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయని, వాస్తవానికి ఏ చెట్ల వేర్లయినా విస్తరిస్తే అలాంటి ఫలితాలే ఉంటాయని చెప్పారు. కోనోకార్పస్ వృక్షాలు వాయుకాలుష్యాన్ని తగ్గిస్తాయని, ఈ చెట్ల ద్వారా సమకూరే నూనె యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతోపాటు మధుమేహాన్ని, వివిధ రకాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని వివరించారు. కోనోకార్పస్ చెట్లు ఆక్సిజన్‌ను పీల్చుకొని కార్పన్డయాక్సైడ్ను విడుదల చేస్తాయంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇటీవల అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేశారని, అది కేవలం అపోహ మాత్రమేనని జన చైతన్య వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు.
నిజానికి ఆ చెట్లు అధికంగా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను సైతం అధికంగా విడుదల చేస్తాయని పరిశోధనల్లో తేలినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చెట్లను నరకడం మానుకోవాలని, లేకుంటే సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలో సగటున ప్రతి మనిషికి 421 మొక్కలు/చెట్లు ఉంటే.. భారత్‌లో ఆ సగటు 28 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వృక్షాల వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలపై యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను గణనీయంగా తగ్గించగలిగే వృక్షాల్లో కోనోకార్పస్ ఒకటని తెలిపారు.సమావేశంలో ప్రొఫెసర్ బీఎన్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకులు గోపాలకృష్ణ, వీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.