హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ నిర్ణయం చట్టసభల పవిత్రతను దిగజార్చేలా ఉన్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం క్రూరపరిహాసం ఆడుతున్నదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నదని ఆరోపించారు.
స్పీకర్ నిర్ణయం ఆ పదవికి మచ్చ తెచ్చే విధంగా, వారి గౌరవానికే భంగం కలిగించే విధంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ద్వంద్వనీతికి స్పీకర్ తీర్పు నిదర్శనంగా నిలుస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు, కూతురును కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి, కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరిన కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇవ్వడం.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. స్పీకర్ నిర్ణయం నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల నమ్మకాన్ని భూస్థాపితం చేస్తున్నదని పేర్కొన్నారు.