హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 31న కేరళలో, జూన్ మొదటివారంలో ఏపీలో అవి ప్రవేశించే అవకాశం ఉన్నది. ఈ నెల 22న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వానలు పడవచ్చని పేర్కొన్నది. దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా, మూడు రోజుల ముందే చేరాయి. జూన్ 1న రుతుపవనాలు కేరళలో ప్రవేశించి జూలై 15 కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. గత ఏడాది ఎల్నినో ప్రభావానికి తోడు బిఫర్జాయ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ, ఈ సారి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికే వస్తుండటంతో జూన్ 1 కల్లా కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి.
మరో మూడు రోజులు వర్షాలు
రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, నాగర్కర్నూల్ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేరొంది. 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వానలు పడవచ్చని తెలిపింది. 23న ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అకడకడ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వెల్లడించింది.