హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు పది రోజుల్లో కేరళను తాకనున్నాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి రుతుపవనాలు ఈనెల 22న అండమాన్‌కు, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా, పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయని తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్‌లో విస్తరించాయని, 27నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తున్నదని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదివారం నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడినట్టు తెలిపింది. మంచిర్యాల జిల్లా నెన్నాల్లో అత్యధికంగా 6.91 సెం.మీ, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో 5.52 సెం.మీ, ఇంద్రవెల్లిలో 4.28 సెం.మీ, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 4.99 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లిలో 4.57 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 3.93 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నది.
ఇక 15జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. సోమవారం మంచిర్యాల, జగిత్యాల, రాజన్న- సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌తోపాటు పలు జిల్లాల్లో అకడకడ వానలు పడతాయని పేరొంది. మంగళవారం నుంచి శనివారం వరకు పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసినట్టు వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు వెల్లడించింది.