రుతుపవనాల ఆగమనంపై 14 తరువాత స్పష్టత
మరింత ఆలస్యమవుతున్న రుతుపవనాలు
పలు జిల్లాల్లో వడగాలులు, స్పల్ప వర్షాలు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల14వ తేదీ తరువాతనే రుతుపవనాల రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రుతుపవన వర్షాలు కావని వెల్లడించారు.
కేరళ, గోవా, కొంకణ్, కర్ణాటక, తమిళనాడులో విస్తరించిన రుతుపవనాలు కూడా బలహీనంగా ఉండటంతో, అక్కడ తేలికపాటి వర్షాలే కురుస్తున్నాయని వివరించారు. ఇప్పుడు కురుస్తున్న వేసవి వర్షాలకు రైతులు విత్తనం వేసుకోవద్దని సూచించారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. 21 జిల్లాల్లో శుక్రవారం 40 డిగ్రీలపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 43,3 డిగ్రీలు, ములుగు జిల్లా మేడారంలో 43.2 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా తంగులలో 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో 14వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.