
ఖైరతాబాద్, నవంబర్ 6: తల్లిపాల విశిష్టత, ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం నుంచి హైదరాబా ద్లో సౌత్ ఇండియా లాంబ్‌కాన్ 2021 సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మంచుకొండ రంగయ్య, డాక్టర్ సీ సురేశ్‌కుమార్, డాక్టర్ సంతోష్, డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సదస్సు బ్రోచర్లను డాక్టర్ వృశాలి, డాక్టర్ వరుణ్, డాక్టర్ విజయానంద్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదస్సు వివరాలను వెల్లడించారు. ఆదివారం రామకృష్ణ మఠ్‌లో ‘ఆర్యజనని’ పేరుతో గర్భవతులు, గర్భం దాల్చాలనుకున్న వారు, బాలింతలు, వారి సంరక్షకులు, ఇంట్లో పెద్దల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు పోషకాహారంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. 12, 13, 14 తేదీల్లో హోటల్ మారియట్‌లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కోసం కాన్ఫరెన్స్, 12న బేసిక్, అడ్వాన్స్‌డ్‌తో పాటు మిల్క్బ్యాంక్పై వర్క్‌షాప్స్, 13, 14 తేదీల్లో బ్రెస్ట్ ఫీడింగ్, మిల్క్ బ్యాంకింగ్, ప్రీ మెచ్యూర్ బేబీస్‌కు తల్లిపాలు ఎలా అందించాలన్న అంశంపై చర్చ జరుగుతుందని చెప్పారు. 13న సాయంత్రం 6 గంటల సదస్సుకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ భారతిప్రవీణ్ పవార్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. దేశంలో చాలా మిల్క్బ్యాంక్లు ఉన్నాయని, కానీ అత్యధికంగా ప్రతిరోజూ 5 లీటర్ల పాలను పిల్లలకు అందిస్తున్న ఏకైక బ్యాంకు నిలోఫర్‌లో ఉందని పేర్కొన్నారు.