SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాచిగూడ-నాగర్ కోయిల్ (16354-16353) మధ్య నడిచే స్పెషల్ రైలుకు కోచ్‌లను బిగించనున్నట్లు చెప్పింది. అత్యాధునిక, భద్రతపరంగా అన్ని సౌకర్యాలున్న ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు బిగించిన రైలు ఈ ఏడాది డిసెంబర్ 13న అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ రైలులో ఒక ఏసీ టూటైర్ కోచ్, ఆరు త్రీటైర్ ఏసీ కోచ్‌లు, ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నాలుగు జనరల్ క్లాస్-సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒకటి పాంట్రీకార్, ఒకటి లగేజ్ కం బ్రేక్ వ్యాన్ ఉంటుందని పేర్కొంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం, మెరుగైన భద్రత ప్రమాణాలతో కన్వెన్షల్ రేక్ నుంచి ఎల్హెచ్బీకి మారుస్తున్నట్లు పేర్కొంది.
లింక్ హాఫ్మన్ బుష్(ఎల్‌హెచ్‌బీ) ప్యాసింజర్ బోగీల్లో నుంచి శబ్దం, కదుపులు తక్కువగా ఉంటాయి. కుదుపులు లేని ప్రయాణం కోసం ఈ కోచ్‌లను వెస్టిబ్యూల్ డిజైన్‌తో తీర్చిదిద్దారు. జర్మన్ సాంకేతికతతో తయారవుతున్న ఈ కోచ్‌లను భారతీయ రైల్వే తయారు చేస్తున్నది. తొలిసారిగా ఈ బోగీలను ఢిల్లీ-లక్నో మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కోసం రైల్వేశాఖ దిగుమతి చేసుకుంది. టెక్నాలజీ షేరింగ్ ఒప్పందంతో దేశంలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీల్లోనూ బోగీలను రైల్వేశాఖ తయారు చేస్తున్నది. 2030నాటికి అన్ని రైళ్లు ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ తరహా కోచ్‌లతోనే నడిపించేందుకు భారతీయ రైల్వేశాఖ ప్రయత్నిస్తున్నది. ఈ కోచ్‌లు తక్కువ బరువు, ఎక్కువ పొడవు, వెడల్పుతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికుల సీటింగ్, బెర్తుల విషయంలో అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు అమర్చిన యాంటీ టెలీస్కోపిక్ టెక్నాలజీ, అధునాతన ఎయిర్ డిస్క్ బ్రేక్ కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు, రైలు పట్టాలు తప్పినప్పుడు బోగీలు పల్టీ కొట్టకుండా ఉంటాయి.
యాంటీ క్లైంబింగ్ సాంకేతికతతో లాక్ సెంటర్ బఫర్ కప్లర్‌ను ఉండడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో రైలు బోగీలు ఒకదానిపై మరొకటి వెళ్లవు. దాంతో రెస్క్యూ ఆపరేషన్ సులువు అవుతుంది. మరోవైపు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మెరుగైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయి. ఈ బోగీలను 200 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించేలా రూపొందించారు. ఈ కోచ్‌లలో ఉపయోగించిన సామగ్రి అగ్ని నిరోధకతను కలిగి ఉండడంతో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా కట్టడి చేసేందుకు వీలుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్లు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఉపయోగిస్తున్నారు. గోదావరి, ఫలక్‌నుమా, తెలంగాణ, దక్షిణ్, నారాయణాద్రి, పద్మావతి, దేవగిరి, సింహపురి రైళ్లన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతోనే నడుస్తున్న విషయం తెలిసిందే.