హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ పరిధిలోని మధిర రైల్వే స్టేషన్‌ను ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా (విశాఖపట్నం) రైల్వే జోన్లో విలీనం చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మధిరతోపాటు తడగడప, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం రైల్వే స్టేషన్లను కూడా విశాఖ జోన్లో కలిపారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి చాలా తగ్గిపోయింది. ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో 6 రైల్వే డివిజన్లతో కొనసాగిన దక్షిణ మధ్య రైల్వే జోన్.. ఇక 3 రైల్వే డివిజన్లకే పరిమితమవుతుంది. ఇప్పటివరకు ఎస్సీఆర్ జోన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, గుంటూరు, గుంతకల్, విజయవాడ రైల్వే డివిజన్లు ఉండేవి. వాటిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను విశాఖ జోన్లో చేర్చడంతో ఎస్సీఆర్ జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ జోన్లు మిగిలాయి.
విశాఖ జోన్లో వాల్తేర్ డివిజన్‌ను కూడా చేర్చడంతో ఆ జోన్లో మొత్తం డివిజన్ల సంఖ్య 4కు చేరింది. స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెంది, ఇప్పటివరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న నల్లగొండ, మిర్యాలగూడ లాంటి కీలక రైల్వే స్టేషన్లను హైదరాబాద్ డివిజనలో.. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రాయచూర్, కృష్ణ, ఎదులాపూర్, యాదగిర్ స్టేషన్లను సికింద్రాబాద్ డివిజన్లో విలీనం చేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నదని రైల్వే శాఖకు చెందిన ఓ కీలక అధికారి తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాజీపేట రైల్వే సెక్షన్‌ను డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఆ ప్రాంత ప్రజలు గత కొన్నేండ్ల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ రైల్వే బోర్డు, బీజేపీ ఎంపీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కావడంతో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని ఉద్యోగులను కూడా విభజించాల్సి ఉంటుంది. ఇది కేవలం లాంఛనమేనని, గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉద్యోగుల విభజన కూడా జరుగుతుందని అధికారులు ధ్రువీకరించారు. దీనిపై కొంత మంది రైల్వే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆప్షన్లవారీగా ఉద్యోగుల విభజన జరిగే అవకాశాలు ఉంటాయని మరికొందరు ఆశిస్తున్నారు.